
సంగారెడ్డి టౌన్, వెలుగు: మహిళా శక్తి ఆధ్వర్యంలో సంగారెడ్డి బైపాస్ రోడ్డులో, గవర్నమెంట్ మెడికల్కాలేజీలో శనివారం కలెక్టర్ క్రాంతి విజయ డెయిరీ పార్లర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. విజయ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మండలల్లో విజయ పార్లర్లను ఏర్పాటు చేస్తామని, తద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు వాహనాలు ఏర్పాటు చేసి విజయ పాలు, పాల ఉత్పత్తులు సరఫరా చేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా విజయ డెయిరీ పార్లర్ ను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. మార్కెట్ లో నకిలీ విజయ పాలు లభ్యమవుతున్నాయని, ప్రజలందరూ విజయ తెలంగాణ ఉత్పత్తులనే వాడాలని కోరారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ మధుసూధన్ రావు, విజయ డెయిరీ ఉద్యోగులు, పాడి రైతులు పాల్గొన్నారు.
పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలి
ఉద్యోగులు పిల్లలందరిని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ, గిరిజన, దళిత వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన వసతుల కల్పన కోసం చర్యలు చేపట్టామన్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్స్కు కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అడిషనల్ఎస్పీ సంజీవరెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి అఖేలేశ్ రెడ్డి, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీశ్, ఆర్డీవోలు, డీస్పీలు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు .